నా ఇంజినీరింగ్ రోజులు-4: రెడ్డి గారి జైత్రయాత్రలు!!

4/01/2009 - రాసింది karthik at Wednesday, April 01, 2009
మా రెడ్డి గారి పూర్తి పేరు "సుబ్బా రెడ్డి" ఈ పేరు మా జిల్లాలో చాల ఎక్కువ. ఒక ఇంట్లొ ముగ్గురు అబ్బాయిలు ఉంటే, ఒకరి పేరు పెద్ద సుబ్బా రెడ్డి, ఇంకొకరి పేరు నడుమ సుబ్బా రెడ్డి మరొకరి పేరు చిన్న సుబ్బా రెడ్డి. ( ఒక వేళ నలుగురుంటే ఏం చేస్తారు?? ఇలాంటి ప్రశ్నలకు నా బ్లాగ్ లో స్థలం లేదు బాబూ)
ఇంక విషయానికి వస్తే ఈ సుబ్బా రెడ్డి క్లాస్ లో నా పక్క బెంచిలో కూర్చోనెవాడు. మా ఫ్రెండ్ అని చెప్పుకోవడం కాదు గానీ, మావాడి గురించి వర్ణించడానికి మాటలు చాలవు. అందుకే కొన్ని సంఘటనలు ప్రజలకు వివరిస్తా

సీన్ 1:
అవి మేము ఇంకా ఫస్ట్ యియర్ లోనే ఉన్న రోజులు. ఒక సీనియర్ కనపడి మిమ్మల్ని (అంటే మా బ్యాచ్ లోని నలుగురిని) ఎప్పుడు చూడలేదే, మీరు నన్ను ఎప్పుడైనా చూశారా అని అడిగాడు. నేను ఏదో డిప్లమటిక్ అన్సర్ కోసం ఆలోచిస్తూ ఉంటే, వాడు వెంటనే " మాకు నువ్వు తెలుసు సార్, ఆ కంప్యుటర్స్ సుధ తో లంచ్ టైం లో వెయిటింగ్ రూం దగ్గర బ్యాటింగ్ పెట్టేది నువ్వే కదా" అన్నాడు. అది విని మా ముగ్గురికి నోట్లో మాట కూడా రాలేదు. ఆ సీనియర్ పరిస్థితి ఇంక ఘోరం. మా కాలేజీలో జూనియర్లతో నువ్వు అనిపించుకున్న వాళ్ళను లాలూ ప్రసాద్ యాదవ్ కంటే హీనంగా చూస్తారు. ఇంకా అక్కడే ఉంటే ఏమేం వినాల్సొస్తుందో అని ఆ సీనియర్ పారిపోయాడు. మేమందరం ఏమిరా ఆ నోరు అంటే, దానికి వాడు తాపీగా "ఓడు మాట్లాడిండు కదా! నాదేం తప్పు??" అన్నాడు. తప్పు నీది కాదురా, నీతో తిరుగుతున్న మాది అనుకున్నాం మేము.

సీన్ 2:
మాకు కొన్ని దిక్కుమాలిన ఇండస్ట్రియల్ టుర్స్ ఉండేవి. అంటే మేము ఇండస్ట్రీస్కి వెళ్ళి కొంచం సేపు టైం పాస్ చేసి వస్తాం. మందు కొట్టే వాళ్ళు బస్సు వెనక సీట్లలో కూర్చుని కొట్టేవాళ్ళు. నా లాంటి వాళ్ళు పాటలు వింటూ నిద్రపోయేవాళ్ళు. అలాంటి ఒకానొక బస్సు ప్రయాణంలో రెడ్డి గారి ఇంటి దగ్గర నుంచి బస్సు వెళుతోంది. మా క్లాస్ లో ఉండె ఏడుపుగొట్టు అమ్మాయిలు, మేమూ రిటర్న్లో మీ ఇంటికి భోజనానికి వస్తాం అన్నారు. ఇంకొకడైతే ఆ మాట విని గుండె పగిలి చచ్చే వాడు. ఎందుకంటే మా క్లాస్ అమ్మాయిల చేత పిలిపించుకోవలసిన ఏకైక పదం "అన్నయ్య ". ఇంక వాళ్ళు ఎవరి ఇంటికైనా వచ్చారూ అంటే ఆ ఇంటికి నవగ్రహ శాంతులు చేయించక తప్పదు. కానీ రెడ్డి గారా మజాకా, సరే రాండి, మా చేలోకి మనుషులు తక్కువైనారు అన్నాడు.

సీన్ -3:
మాకు థర్మల్ ఇంజినీరింగ్ అని ఒక సబ్జెక్ట్ ఉండేది. ఆ సార్ చాలా సీరీయస్ మనిషి. ఒక రోజు ఏదో సొల్లు చెబుతున్నాడు, రెడ్డి గారి పక్కనున్న వాడికి అది అర్థం కాలేదు. అందుకని వాడు డౌట్ అడగాలని అనుకున్నాడు. వాడు అడగక ముందే ఆ డౌట్ ఏంటనేది రెడ్డి గారికి తెలిసిపోయింది. ఇంక సార్ కు చాన్స్ ఇవ్వకుండా వాడే " ఇప్పుడు ఒక బకీటు (మా ఊర్లో బకెట్ ని ఇలానే పిలుస్తారు :) ) నీళ్ళలో నుంచి ఒక గలాసు తీసేస్తే ఇంక ఎన్ని ఉంటయి? " అని ఇంక ఏదో చెప్పబోయాడు. "గలాసు" అన్న పదం విని వాడు తట్టుకోలేక "క్కి క్కి క్కి క్కి" అని నవ్వాడు. వాడి ఖర్మ కాలి అది మా సార్ చూశాడు. వెంటనే ఇద్దరికి తనను " పర్సనల్ " గా కలవమని చెప్పాడు. కట్ చేస్తే సార్ రూములో రెడ్డి గారు, వాడి పక్కనున్న వాడూ తేలారు.
సార్: ఏంటండీ, మీరు క్లాస్ చెప్పేటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే ఎలా ఉంటుంది?
పక్క వాడు: నిజమే సార్, ఐ యాం వెరీ సారీ.
రెడ్డి గారూ: ......
పక్క వాడు: ఐ విల్ నాట్ రిపీట్ థిస్ మిస్టేక్
రెడ్డి గారూ: ......
వాడు బయటికి వచ్చాక, సభ్య సమాజం హర్షించని కొన్ని పదాలతో రెడ్డి గారిని పొగిడి, ఇంకెప్పుడు రెడ్డి గారు కుర్చున్న బెంచికి కనీసం మూడు బెంచుల దూరం లో కూర్చుంటాను అని ఒట్టు పెట్టుకున్నాడు. అంతా అయ్యాక నేను వాడిని ఎందుకు సార్ కు కనీసం సారీ కూడా చెప్పలేదు అని అడిగాను. దానికి వాడు "నాకు ఫస్ట్ ఇంటర్నల్ లో 48/50 వచ్చాయి ఇంక సారీ చెప్పినా చెప్పక పొయినా ఏమి లాభం" అన్నాడు.

ఇంత చేసినా వాడంత షార్ప్ గా ఉండే వాళ్ళని నేను చాలా తక్కువ మందిని చూశాను. కోచింగ్ లేకుండా, మా క్లాస్ లో ఐ.ఐ.టి. సీట్(GATE-05, AIR 34) కొట్టిన ఇద్దరిలో వాడూ ఒకడు. ఇప్పుడు బెంగుళూరు ఒరాకిల్ అనే కంపెనీలో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నాడు.

-కార్తీక్
(ఈరోజు వాడి పుట్టిన రోజు. అందుకని బ్లాగుముఖంగా వాడికి జన్మదిన శుభాకంక్షలు చెబుతున్నాను)